

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం MCRHRDలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, ఇతర సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆయా వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తున్నామని కమిటీకి వివరించారు. శాసనసభ స్పీకర్గా, మంత్రులుగా దళితులకు అవకాశం కల్పించడంతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ కార్పొరేషన్లలోనూ ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళితుడికి అవకాశం ఇచ్చామని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐటీల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వీసీలుగా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఆరోగ్యశ్రీ నిధుల్లో 50 శాతానికి పైగా ఈ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్, కమిటీ సభ్యులు తాపీర్ గావ్, హరీశ్చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, ప్రసాద రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!