

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రుల మండలి సమావేశం జరిగింది. దేశంలో పేదరికాన్ని తగ్గించడంతో పాటు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. 2011 నుంచి 2023 మధ్య కాలంలో భారత్లో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించిన అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు. పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిపై చర్చించారు. అలాగే, దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ నక్సలిజం నిర్మూలనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను మంత్రులకు వివరించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సమస్యను పూర్తిగా అంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించింది. మరోవైపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ మంత్రులను ఆదేశించారు. పథకాల అమలులో ఎలాంటి లబ్ధిదారులు మిగిలిపోకుండా 100 శాతం కవరేజీ సాధించాలని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి, అంతర్గత భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఈ సమావేశం మరోసారి స్పష్టం చేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!