

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశం పట్ల చూపిన అంకితభావం, రాజకీయ విలువలు, మిత్రపక్షాల పట్ల నిబద్ధత ప్రశంసనీయమని సీపీఐ సీనియర్ నాయకుడు కే. నారాయణ అన్నారు. సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రస్థానం, జీవితంలో తీసుకున్న నిర్ణయాలపై నారాయణ స్పందించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల అనంతరం కూడా భారత్లోనే కొనసాగుతూ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఆమెకు దేశం పట్ల ఉన్న అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య కొనసాగిన రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ, మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలను సోనియా గాంధీ గౌరవించారని నారాయణ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాన్ని కేవీపీ రామచంద్రరావుకు కేటాయిస్తారని భావించినప్పటికీ, కూటమి అవగాహన మేరకు సీపీఐ నేత సయ్యద్ అజీజ్ పాషాకు అవకాశం కల్పించడంలో ఆమె చొరవ చూపారని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే కూటమి ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆమె రాజకీయ నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!