

ప్రపంచ వేదికలపై రాహుల్ గాంధీ భారతదేశంపై విమర్శలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువ నిధులను కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ రేషన్ కార్డులపై ఆయన ఫొటో లేకపోవడం, కిలో బియ్యం అందిస్తున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు పెట్టుకోవడంపై ఈటల ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం మారితే మళ్లీ రేషన్ కార్డులు ముద్రిస్తారా? ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంకుచితంగా వ్యవహరించవద్దని సూచించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే, మున్సిపల్ పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో భేటీ అనంతరం సచివాలయంలో మీడియాతో ఈటల మాట్లాడారు. గతంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా నిధులు ఖర్చు చేసేవని, ప్రస్తుతం రైల్వే శాఖే 100 శాతం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు 23 రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ఎన్‌ఓసీలు, ట్రాఫిక్ డైవర్షన్ వంటి అంశాల్లో సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. మల్కాజిగిరి పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా చెల్లింపులపై అనిశ్చితితో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. అర్బన్, రూరల్ హౌసింగ్ పథకాల కింద కేంద్రం నిధులు అందిస్తుందని, వాటిని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2కు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇతర కనీస పౌర సదుపాయాలను మెరుగుపరచాలని కోరినట్లు ఈటల వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!