

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ హాకీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్’ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతిభను చాటుతున్నారు. లీగ్ పోటీల్లో ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ జట్టు రాయల్ హాకీ క్లబ్, బీహెచ్‌ఈఎల్‌పై 5–0తో విజయం సాధించగా.. గచ్చిబౌలి హాకీ క్లబ్ టీజీఆర్జేసీ స్కూల్, బోరబండపై 5–0తో గెలిచింది. ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై 2–1తో, గచ్చిబౌలి హాకీ క్లబ్ రాక్‌రోవర్స్ క్లబ్, అంబర్‌పేట్‌పై 5–0తో విజయం సాధించాయి.
సెమీఫైనల్‌లో గచ్చిబౌలి హాకీ క్లబ్ 2–0తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్‌లో ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ 1–0తో టీజీఆర్జేసీ స్కూల్, బోరబండను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో టీజీఆర్జేసీ స్కూల్, బోరబండ పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై విజయం సాధించింది. ఆగస్టు 29న ఉదయం 7:30 గంటలకు గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం గచ్చిబౌలి హాకీ క్లబ్, ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ మధ్య జరిగే ఫైనల్‌ను ప్రారంభించనున్నారు. యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచడం, హాకీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడం, ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించే వేదిక కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!