

ఏఐ ఏజెంట్లు భౌతిక యంత్రాలతో సులభంగా కమ్యూనికేట్ చేస్తూ వాటిని నిర్వహించేందుకు ఆంత్రోపిక్ ‘మోడల్ హార్డ్‌వేర్ స్టాండర్డ్’ (MHS)ను పరిశోధన ప్రివ్యూగా ప్రకటించింది. డారియో అమోడీ నేతృత్వంలోని ఈ సంస్థ రూపొందించిన ఈ ఇంటర్‌ఫేస్ ప్రోగ్రామబుల్ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్ ఉన్న వివిధ పరికరాలతో పనిచేసేలా రూపొందించారు. మైక్రోస్కోపులు, లిక్విడ్ హ్యాండ్లర్లు, రోబోటిక్ ఆర్మ్స్ వంటి ల్యాబొరేటరీ, తయారీ పరికరాలను ఏఐ ఏజెంట్లతో అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం వేర్వేరు సంస్థలకు చెందిన పరికరాలను ఒకే వ్యవస్థలో పనిచేయించేందుకు వారాలు, నెలల సమయం పట్టే పరిస్థితికి MHS పరిష్కారం చూపుతుందని ఆంత్రోపిక్ తెలిపింది.
MHS ద్వారా ప్రతి యంత్రం తన సామర్థ్యాలు, కొలతలు, మార్చగల సెట్టింగులు, భద్రతా పరిమితులను ఏఐకి తెలియజేయగలదు. దీంతో ఏఐ ఏజెంట్ ఒకేసారి పలు యంత్రాలను సమన్వయం చేస్తూ డ్రగ్ డిస్కవరీ, మైక్రోస్కోపీ, తయారీ వంటి క్లిష్టమైన పనులను నిర్వహించే అవకాశం ఉంటుంది. జెనెంటెక్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, హెచ్‌హెచ్‌ఎంఐ జానెలియా వంటి సంస్థల్లో నిర్వహించిన ప్రయోగాలను ఆంత్రోపిక్ ఉదాహరణలుగా పేర్కొంది. అయితే భౌతిక ప్రపంచంలోని అనూహ్య సమస్యలను ఏఐ ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదని సంస్థ అంగీకరించింది. లిక్విడ్ హ్యాండ్లింగ్ సమయంలో బుడగలు ఏర్పడినప్పుడు క్లాడ్ తొలుత ప్రక్రియను పునఃప్రారంభించడంతో సమస్య మరింత పెరిగిందని తెలిపింది. అనంతరం మానవ నిపుణుడు కారణాన్ని వివరించడంతో ఏఐ దానిని నేర్చుకుని మెరుగ్గా స్పందించింది. పరిశోధన ప్రివ్యూ అనంతరం MHSను ఓపెన్ సోర్స్‌గా అందుబాటులోకి తీసుకురావాలని ఆంత్రోపిక్ భావిస్తోంది. ఈ స్టాండర్డ్ క్లాడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఏఐ మోడళ్లతోనూ పనిచేసేలా రూపొందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!