

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన సెటిల్‌మెంట్‌కు అనుమతినిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన తీర్పుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అప్పీల్‌కు సిద్ధమవుతోంది. రూ.22,006.57 కోట్లకు పైగా ఉన్న రుణదాతల క్లెయిమ్‌లను కేవలం రూ.6.5 కోట్లతో పరిష్కరించుకునేందుకు అనుమతి లభించడంపై బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సెటిల్‌మెంట్ ద్వారా మొత్తం బకాయిల్లో సుమారు 0.03 శాతం మాత్రమే రికవరీ అవుతుందని పేర్కొంది.
ఆగస్టు 27న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం క్లెయిమ్‌లో తమకు ఆమోదించబడిన వాటా 3.2 శాతం, అంటే రూ.680 కోట్లు. ఈ రుణ సదుపాయాన్ని తొలుత హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ అందించగా.. రెండు సంస్థల విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దానిని స్వీకరించింది. ప్రతిపాదిత సెటిల్‌మెంట్‌ను తాము వ్యతిరేకించామని, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ మెజారిటీ రుణదాతల మద్దతుతో అది ఆమోదం పొందిందని బ్యాంక్ తెలిపింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాలు చేసేందుకు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!