

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి అభిప్రాయం ఒకటేనని, అదే అమరావతి రాజధాని కావాలన్నదేనని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోద దశకు చేరుకోవడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది భావోద్వేగ క్షణమని అన్నారు.
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి భారీ రెవెన్యూ లోటు ఏర్పడిందని, భవిష్యత్తు పై అనిశ్చితి నెలకొన్నదని గుర్తుచేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయకత్వం ప్రజలకు ఆశను కలిగించిందని అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి రైతులు చూపిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తక్కువ సమయంలోనే వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగం ప్రశంసనీయమన్నారు.
అలాగే గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల రాష్ట్రంలో గందరగోళం ఏర్పడిందని అన్నారు. అయినప్పటికీ అమరావతిని నిలబెట్టడంలో ప్రజలు ఏకతాటిపై నిలిచారని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చిన హామీకి ప్రజలు మద్దతు తెలుపుతూ భారీ విజయాన్ని అందించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిని రాజధానిగా అంగీకరించడం రాష్ట్ర ఐక్యతను సూచిస్తోందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!