

న్యూయార్క్‌లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్రంప్ విడుదల చేయగా, తాజాగా వీడియోలు కూడా బయటపెట్టారు. మదురోను వెనెజువెలా నుంచి తీసుకువచ్చి అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) న్యూయార్క్ డివిజన్ కార్యాలయంలో నిర్బంధించినట్లు ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతోంది.
శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా ప్రత్యేక దళాలు ఆకస్మిక దాడి చేశాయి. ఈ దాడి సమయంలో మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా, యూఎస్ భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. మదురో దంపతులు కారకాస్‌లోని హై సెక్యూరిటీ ఫోర్ట్ టియునా మిలిటరీ కాంపౌండ్‌లోని తమ నివాసంలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగింది. వారు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ, అది సఫలం కాలేదు.
రాపిడ్ రెస్పాన్స్ 47 టీమ్ అధికారిక ఎక్స్ అకౌంట్లో మదురోకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో లోయర్ మాన్‌హట్టన్‌లోని డీఈఏ న్యూయార్క్ డివిజన్ కార్యాలయంలోకి మదురోను అధికారులు తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. చేతులకు సంకెళ్లు వేసి సెక్యూరిటీ సిబ్బంది మధ్య బందీగా ఉన్న మదురో, ఒక గదిలోకి వెళ్తుండగా సిబ్బందికి గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తున్నారు. దాడి తర్వాత మదురో దంపతులను ముందుగా అమెరికా సైనిక స్థావరానికి, ఆ తర్వాత న్యూయార్క్‌కు తరలించారు. మదురోను డీఈఏ కార్యాలయం నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్తారని యూఎస్ మీడియా తెలిపింది. మదురో దంపతులపై నార్కో టెర్రరిజం, టన్నుల కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు వంటి అభియోగాలు మోపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!