

పెండింగ్ చలానాల వసూలు పేరుతో ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురవుతున్న వాహనదారులకు హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించాలంటూ వాహనదారులను పోలీసులు బలవంతపెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వాహనాలను ఆపి బైక్ కీలు లాక్కోవడం, వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం వంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో, వాహనదారులు తమ ఇష్టపూర్వకంగా చలానాలు చెల్లిస్తామని ముందుకు వస్తేనే వసూలు చేయాలని కోర్టు పేర్కొంది. ఒకవేళ వాహనదారులు చలానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, వారికి చట్టప్రకారం కోర్టు నోటీసులు జారీ చేయాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు వసూళ్లు చేయరాదని హైకోర్టు తేల్చిచెప్పింది.
పెండింగ్ చలానాల పేరిట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ, వసూళ్ల కోసం పోలీసులు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.
అదే సమయంలో, చాలా పెండింగ్ చలానాలను ‘వర్చువల్ కోర్టు’ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే పరిష్కరించుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. కోర్టు ద్వారా వెళ్లినప్పుడు కొన్ని సందర్భాల్లో మెజిస్ట్రేట్ ముందు వివరణ ఇచ్చి జరిమానా తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రభుత్వం నిర్వహించే లోక్ అదాలత్ సమయాల్లో పెండింగ్ చలానాలపై భారీ రాయితీలు లభిస్తాయని, ఆ సమయంలో చెల్లించడం వాహనదారులకు లాభదాయకమని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!