

దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన–2027 కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి దశగా 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలోని ఇళ్ల వివరాలు, భవనాలు, నిర్మాణాల పై సమాచారం సేకరించనున్నారు. ఈ దశలో గృహాల స్థితిగతులు, నివాస సౌకర్యాల పై పూర్తి వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు ప్రారంభమై, మార్చి 1 అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈసారి ప్రత్యేకంగా కుల గణనను కూడా జనగణనలో భాగంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తం జనగణన ప్రక్రియను డిజిటల్ విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దుల నవీకరణ, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల నియామకం, వారికి అవసరమైన శిక్షణ వంటి ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాలు, అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
ఈ జనగణన అనంతరం లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!