
.jpg&w=3840&q=75)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన 300 డివిజన్ల పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గత ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సవరించింది.
వార్డుల విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి 104, 134 డివిజన్ల వివరాలను మాత్రమే అధికారిక వెబ్సైట్లో పొందుపర్చాలని కోర్టు ఆదేశించింది. మొత్తం జీహెచ్ఎంసీ వార్డుల మ్యాప్‌లు, జనాభా వివరాలన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పొన్న వెంకట్ రమణతో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి, అన్ని డివిజన్ల మ్యాప్‌లు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.
అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ Telangana High Court డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదనలు విన్న ధర్మాసనం, ఈ దశలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. 104, 134 వార్డుల వివరాల పైనే అభ్యంతరాలు ఉన్నందున, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈ రెండు వార్డులకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది.
అలాగే, పిటిషనర్లకు మాత్రమే వారి వార్డులకు సంబంధించిన సమాచారం శనివారం ఉదయం 10 గంటల్లోగా అందించాలని ఆదేశించింది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల పునర్విభజన) నిబంధనల ప్రకారం, సంబంధిత వార్డుల పిటిషనర్లకు 48 గంటల వ్యవధిలో అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!