

వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ దామోదర రాజనర్సింహ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ కమిటీలు ప్రతి నెలా నివేదికలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించాలని, ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక ఇంగ్లీష్ తరగతులు నిర్వహించి, ఇందుకోసం ప్రత్యేక టీచర్లను నియమించాలని సూచించారు.
ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై కఠిన నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మెడికోల ఆత్మహత్యల నివారణ కోసం అన్ని కాలేజీల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాలేజీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్‌ను పటిష్టం చేసి, సిబ్బంది పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే విశ్వవిద్యాలయ కార్యకలాపాలన్నింటిని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!