

తెలంగాణ రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. 2026 జనవరి 23న కేరళలోని తిరువనంతపురం నుంచి దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో తిరువనంతపురం–చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉండగా, ఇది ఇప్పటికే నడుస్తున్న చర్లపల్లి–ముజఫర్‌పూర్ రైలు తర్వాత తెలంగాణకు రెండో అమృత్ భారత్ రైలు కానుంది.
17041 నెంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17042 నెంబరుతో గురువారం రాత్రి 11.30 గంటలకు బయలుదేరి శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ నాన్-ఏసీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ మరియు బాటిల్ హోల్డర్స్, రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, సౌకర్యవంతమైన సీటింగ్ మరియు స్లీపింగ్ ఏర్పాట్లు, ఆధునిక టాయిలెట్స్, అగ్నిమాపక వ్యవస్థ, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, స్పీడ్ చార్జింగ్ పాయింట్లు, పాంట్రీ కార్ వంటి సదుపాయాలు ఉంటాయి. తెలంగాణకు మరో అమృత్ భారత్ రైలును కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!