

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. జ్యురిచ్ విమానాశ్రయంలో స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా సీఎంతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అలాగే పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకొని పర్యటనకు సిద్ధమయ్యారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాలలో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. ప్రత్యేకంగా, తొలి రోజున వివిధ రంగాల కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొని, తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వృద్ధి విధానాలపై అవగాహన పెంచుతారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను పరిచయం చేయనున్నారు. ఈ రోడ్‌మ్యాప్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, సుస్థిర అభివృద్ధి విధానాలు వంటి అంశాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు వివరించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న అభివృద్ధి నమూనా ప్రకారం, సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించబడింది. ఈ పర్యటన ద్వారా తెలంగాణను అంతర్జాతీయ మాండలికంలో పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా కొనసాగించడానికి ప్రయత్నించనున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!