

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలిసిందన్న ఆరోపణల పై పలువురు ప్రముఖ స్వామీజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి ఘటన జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
లడ్డూ కల్తీ వ్యవహారానికి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వామీజీలు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు లేఖలు రాశారు. ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా పరిగణించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
కర్ణాటకకు చెందిన శ్రీశ్రీ వ్యాసరాజ మఠం స్వామీజీ శ్రీవిద్యాశ్రీషతీర్థ, తమిళనాడులోని మన్నార్గుడి మఠం స్వామి చెందలంకర సంపత్ కుమార రామానుజ జీయర్, అలాగే శ్రీ పెరంబదూర్ జీయర్ స్వామి ఈ లేఖలు పంపిన వారిలో ఉన్నారు. శ్రీవారి ప్రసాద పవిత్రతను కాపాడటం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్వామీజీలు స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!