

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ మోసాల పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్ము దోపిడీకి గురవడం చాలా ప్రమాదకర పరిస్థితి అని పేర్కొంది. ఇవి సాధారణ మోసాలు కాకుండా, భారీ చోరీలు లేదా బందిపోటు దోపిడీలతో సమానం అని వ్యాఖ్యానించింది.
ఈ అంశం పై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు స్పష్టమైన ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) అవసరమని అభిప్రాయపడింది. ఈ SOPను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్యకాలంలో దేశంలో రూ.52 వేల కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదికలో ఉన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మొత్తం అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళనకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా నేరగాళ్లతో కుమ్మక్కు కావడం వల్ల జరిగి ఉండొచ్చని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కేవలం రూ.15–20 వేల పింఛను పొందే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్‌డ్రా అయితే, బ్యాంకుల ఏఐ వ్యవస్థలు ఎందుకు అప్రమత్తం కావడం లేదని ప్రశ్నించింది.
ఇకపై చేపట్టాల్సిన చర్యలపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించాలని సీబీఐ కి ఆదేశించింది.
ఈ కేసుల విచారణకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలను స్పష్టం చేసింది.
అలాగే డిజిటల్ అరెస్ట్ బాధితులకు పరిహార విధానం రూపొందించేందుకు ఆర్బీఐ, టెలికాం శాఖలు సమావేశం కావాలని ఆదేశించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!