

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. శనివారం ముంబయిలో జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకుని, అదే రోజు సాయంత్రం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉందని సమాచారం. సునేత్రా పవార్ నియామకానికి పార్టీలో ఎలాంటి అడ్డంకులు లేవని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అజిత్ పవార్ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఎన్సీపీ చీలిక వర్గాల పునరేకీకరణపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. అజిత్ పవార్ జీవించి ఉన్నప్పుడే శరద్ పవార్‌తో పాటు సుప్రియా సూలే, జయంత్ పాటిల్‌లతో కలయికపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే పుణె, చించ్వాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సునేత్రా పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఈ పునరేకీకరణ ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరోవైపు అజిత్ పవార్ మరణానికి సంబంధించిన విమాన ప్రమాదంపై మహారాష్ట్ర సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!