

కృష్ణాజిల్లా పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్‌కుమార్ (17) ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థులతో జరిగిన వివాదం నేపథ్యంలో జనవరి 5, 30 తేదీల్లో కొంతమంది విద్యార్థులు పవన్‌పై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ దాడి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవన్ జనవరి 31న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పవన్‌ను వేధించిన ఆరుగురు విద్యార్థులతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసిన కాలేజీ సిబ్బంది సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, పవన్‌కుమార్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టి చంపిన ఘటనను కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!