

దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగోలో ఏర్పడ్డ అంతర్గత సమస్యలు వరుసగా మూడో రోజూ విమాన రద్దులకు దారి తీసాయి. గురువారం ఒక్కరోజే 550 కి పైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావడంతో పలు నగరాల్లో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోవాల్సి వచ్చింది. అనూహ్య రద్దుల పై ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
విమానాల కొరత ప్రభావం టికెట్ ధరల పై తీవ్రంగా పడింది. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే టికెట్ ధర సుమారు రూ.36,668 ఉండగా, అదే సమయంలో ఢిల్లీ–ముంబై టికెట్ ధర రూ.40,452 చేరుకోవడం ప్రయాణికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రధాన నగరాల మధ్య మామూలుగా రూ.6–10 వేల వరకు ఉండే టికెట్ ధరలు ఇప్పుడు రూ.22–30 వేల మధ్య ఉన్నాయి.
ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణంగా డీజీసీఏ కొత్త విశ్రాంతి నిబంధనలను సూచిస్తోంది. రాత్రి వేళల్లో భారీ సంఖ్యలో సర్వీసులు నడిపే ఇండిగో, ఈ నిబంధనలకు తగ్గట్లుగా సిబ్బంది షెడ్యూళ్లు మార్చకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. పైలట్ల సంఘాలు కూడా ఇది ఇండిగో ప్రణాళికా లోపమేనని విమర్శిస్తున్నాయి.
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటనలో, సాంకేతిక ఇబ్బందులు, షెడ్యూల్ మార్పులు, వాతావరణ ప్రభావం, డ్యూటీ నిబంధనలు అన్ని కలిసి ఈ పరిస్థితికి కారణమయ్యాయని తెలిపారు. కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ పరిస్థితి పై సమీక్ష జరిపి, సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంస్థను ఆదేశించారు. ప్రయాణికుల పై అదనపు భారంగా టికెట్ ధరలు పెంచొద్దని హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!