

సింగపూర్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. జుబిన్ గార్గ్ హత్యకు గురికాలేదని, మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించాడని స్పష్టం చేశారు. ఈ విషయాలను కోర్టుకు సమర్పించిన అధికారిక నివేదికలో పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన రోజు జుబిన్ గార్గ్ మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మొదట లైఫ్ జాకెట్ ధరించి నీటిలోకి దిగిన అతను, తరువాత లైఫ్ జాకెట్ లేకుండా మరోసారి ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన జుబిన్ పడవ వైపు చేరేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పోస్ట్మార్టం నివేదికలో కూడా జుబిన్ గార్గ్ నీటిలో మునిగి మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. అతడి శరీరంపై కనిపించిన గాయాలు సీపీఆర్ మరియు రెస్క్యూ సమయంలో వచ్చినవేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి నేరపూరిత అంశాలు లేవని స్పష్టం చేశారు. అస్సాంకు చెందిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ గత ఏడాది, సెప్టెంబర్ 19 న సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ మరణించాడు. ఈ ఘటనపై అనుమానాలు రావడంతో అస్సాం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ దర్యాప్తు చేసి పలువురిని అరెస్ట్ చేసినప్పటికీ, సింగపూర్ పోలీసులు మాత్రం ఇది హత్య కాదని, పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిన మరణమని తేల్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!