

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూళ్లలో ప్రత్యేకంగా ‘సిక్ రూమ్’ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించనున్నారు.
ఈ సిక్ రూమ్‌లో ప్రథమ చికిత్స కిట్లు, అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా గాయపడినప్పుడు, వెంటనే ఇక్కడ ప్రాథమిక వైద్య సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ గదిని మెడికల్ రూమ్ / సిక్ రూమ్ / నర్సు ఆఫీస్ గా ఉపయోగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 600 కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సిక్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఖర్చులను సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి సమకూర్చనున్నారు. ఒక్కో సిక్ రూమ్ ఏర్పాటు కోసం రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
2026 మార్చి నాటికి ఈ సిక్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తొలి దశలో 600 స్కూళ్లలో ఏర్పాటు చేసి, అనంతరం విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు.
స్కూల్లో పెద్దగా ఉన్న గదిని రెండు భాగాలుగా విభజించి, అందులో ఒక గదిని సిక్ రూమ్‌గా మార్చనున్నారు. స్థానిక ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి ఆధారంగా విద్యార్థుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నారు.
అలాగే, టీచర్లు, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సిక్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం వంటి అంశాల పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ చర్య ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!