

రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రమాదం గుంటూరు జిల్లా లోని అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారి పై జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు సూర్యాపేట ప్రాంతానికి చెందినవారిగా సమాచారం. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మరో ఘోర ప్రమాదం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
శీతాకాలంలో పొగమంచు, తక్కువ దృష్టి వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!