

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరంలో దాదాపు 75 డాల్ఫిన్లు గుంపుగా ఈదుతూ కనిపించి పర్యాటకులను ఆకట్టుకున్నాయి. దేవ్‌బాగ్, తార్కర్లీ బీచ్ సమీపంలో సముద్రంలో ఒకేచోట ఇంత పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు కనిపించడం ఇదే తొలిసారి అని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యం పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ అద్భుత దృశ్యాన్ని సముద్ర జీవ శాస్త్రవేత్త విశాల్ భావే డ్రోన్ సాయంతో చిత్రీకరించారు. ఈ ప్రాంతంలో కనిపించినవి హిందూ మహాసముద్ర హంప్‌బ్యాక్ జాతికి చెందిన డాల్ఫిన్లు అని నిపుణులు పేర్కొన్నారు. సింధుదుర్గ్, రత్నగిరి తీర ప్రాంతాలు డాల్ఫిన్ల ఆవాసాలుగా ప్రసిద్ధి చెందాయి. సముద్ర జీవాలను సంరక్షించేందుకు పడవలు వాటికి దగ్గరగా వెళ్లకుండా, శబ్దాలతో ఆటంకాలు కలిగించకుండా బాధ్యతాయుతమైన పర్యాటక విధానాలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!