

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం వ్యయం రూ.62,436 కోట్లకు చేరనుంది. తొలి దశలో +41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.30,436.95 కోట్లను మంజూరు చేసింది. అయితే, ఈ దశకు ఇంకా రూ.6,645 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది.
రెండో దశలో +45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనుల కోసం మరో రూ.32,000 కోట్ల వరకు ఖర్చవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రెండో దశకు సంబంధించిన సమగ్ర లెక్కలు సిద్ధం చేసి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. తొలి దశ, రెండో దశ అంచనాలను కలిపితే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.62,436 కోట్లుగా ఉండనుంది.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రాష్ట్రానికి రూ.23,658.40 కోట్లను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో కేంద్రం అడ్వాన్స్ రూపంలో నిధులు ఇస్తుండటంతో, ఒకప్పుడు ఉన్న రీయింబర్స్మెంట్ ఇబ్బందులు తగ్గాయి. ప్రస్తుతం కొంత అడ్వాన్స్ మొత్తం రాష్ట్ర ఖజానాలోనే ఉంది. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్లో సుమారు 80 శాతం ఖర్చు చేసిన నేపథ్యంలో, మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,034 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తున్నారు.
కాలువల నిర్మాణానికి సంబంధించి నిధుల పై కూడా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2009 డీపీఆర్ ప్రకారం ఎడమ కాలువను 8,123 క్యూసెక్కులు, కుడి కాలువను 11,654 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వాలని ప్రతిపాదించారు. అయితే 2019 లో సాంకేతిక సలహా కమిటీ సూచనల మేరకు రెండు కాలువలనూ 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. కుడి కాలువ పనులు పూర్తికాగా, ఎడమ కాలువ పనులు కొనసాగుతున్నాయి.
పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు జరిగిన ఖర్చును కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రస్తుతం కేంద్రం మాత్రం 2009 డీపీఆర్ ప్రకారమే ధరలు ఖరారు చేసి, కుడి కాలువకు 93 శాతం, ఎడమ కాలువకు 77 శాతం మాత్రమే నిధులు అనుమతించి మిగతా మొత్తాన్ని కోత పెట్టింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఈ అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండో దశ నిధుల సాధన కోసం లేఖను కూడా సమర్పించారు.
2005–06 నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.10,151.03 కోట్లుగా ఉండేది. ప్రాజెక్టు ఆలస్యంతో పాటు ధరలు పెరగడంతో 2010–11, 2013–14, 2017–18 సంవత్సరాల్లో అంచనాలను సవరించారు. తాజాగా రెండో దశ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని అంచనాలు మళ్లీ సవరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!