

భారతదేశ పురోగతిని ఎవరూ అడ్డుకోలేరని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. దిల్లీలో జరుగుతున్న ‘రైసినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ తన బలాల ఆధారంగానే అభివృద్ధి మార్గాన్ని నిర్ణయించుకుంటుందని చెప్పారు. ఇతర దేశాల తప్పిదాలు లేదా విధానాలపై భారత్ ఆధారపడదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టఫర్ లాన్డౌ చేసిన వ్యాఖ్యలకు జైశంకర్ స్పందిస్తూ భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
ఇక భవిష్యత్తులో ప్రపంచం బహుళ ధ్రువ వ్యవస్థ వైపు కదులుతుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క దేశం అన్ని రంగాల్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే యుగం ముగిసిందని చెప్పారు. అదే సమయంలో మానవతా దృక్పథంతో భారత్ తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. శ్రీలంక సమీపంలో సమస్యలు ఎదుర్కొన్న ఇరాన్ యుద్ధ నౌకకు కొచ్చిన్ పోర్టులో ఆశ్రయం ఇచ్చిన విషయాన్ని సమర్థిస్తూ, నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి భారత్ సహాయం అందించిందని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!