

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మాట్లాడుతూ, రాష్ట్రంలో వచ్చే మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా చేస్తున్నాయని వివరించారు. భయంతో కొనుగోళ్లు పెరిగినా సరఫరా వ్యవస్థ ఎక్కడా ఆగలేదని తెలిపారు.
అదనంగా 16,000 కిలోలీటర్ల బఫర్ స్టాక్‌తో పాటు 1,200 ట్యాంకర్లు వినియోగంలోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని బంకుల్లో కనిపిస్తున్న “నో స్టాక్” బోర్డులు సరఫరా ఆలస్యం కారణంగా మాత్రమేనని, అసలు కొరత లేదని స్పష్టం చేశారు. డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని 596 పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, అధికారులు 24 గంటలు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా సమృద్ధిగా ఉందని, వాణిజ్య ఎల్పీజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పుకార్లను నమ్మవద్దని, భయంతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు.








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!