

క్రీస్తు త్యాగాలను స్మరించుకుని ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి మత పెద్దలకు తినిపించగా, అనంతరం అందరితో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజునే క్రిస్మస్‌గా జరుపుకుంటామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగలలో ఒకటని పేర్కొన్నారు. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు సమస్త మానవాళికి పండుగగా మారిందని తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ వంటి శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని చెప్పారు. పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు ఏసు తన సిద్ధాంతాల కోసం త్యాగానికీ వెనుకాడలేదని గుర్తు చేశారు. ప్రభువు త్యాగాన్ని స్మరించుకుంటూ శాంతి మార్గాన్ని అనుసరించాలని, ప్రేమ తత్వాన్ని పెంపొందించాలని, ఈర్ష్యా ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ బోధిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!