

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
‘ది వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్ (VBGRAMG)’ పేరుతో నూతన పథకాన్ని ప్రతిపాదిస్తూ సంబంధిత బిల్లును లోక్సభకు పంపింది.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే, ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఎన్రేగా స్థానంలో ఈ కొత్త పథకం అమలులోకి రానుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రామీణ కుటుంబాలకు కల్పించే ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచే అవకాశం ఉంది.
మొదటగా ఈ పథకం 2005 లో NREGA గా ప్రారంభమైంది. అనంతరం 2009 అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా దీనికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మారింది. ఈ పథకం కింద ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి పొందే హక్కు కల్పించారు.
పథకం పనితీరును సమీక్షించేందుకు 2022 లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన నివేదికను గతేడాది ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబం సగటున సుమారు 50 రోజులు మాత్రమే ఉపాధి పొందింది.
అదేవిధంగా 40.7 లక్షల కుటుంబాలే 100 పని దినాలు పూర్తి చేయగలిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే కేవలం 6.74 లక్షల కుటుంబాలు మాత్రమే పూర్తిస్థాయిలో ఉపాధిని వినియోగించుకున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి దినాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు గతంలోనే కేంద్రాన్ని కోరాయి. కొన్ని రాష్ట్రాలు తమ సొంత బడ్జెట్ను వినియోగించి అదనపు పని దినాలను కల్పించాయి.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు స్వంత వనరులతో ఎక్కువ ఉపాధిని సృష్టించగలిగాయి.











కామెంట్స్ (1)
Good Decision