

అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్ల వీసా అపాయింట్మెంట్లు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం అమెరికా వెలుపలికి ప్రయాణించవద్దని, బయటకు వెళ్లినట్లయితే తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమవుతుందని, దాంతో నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తుందని గూగుల్ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలిపింది.
హెచ్1బీ, హెచ్4 వీసాలపై ఉన్న ఉద్యోగులు అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పట్లో పూర్తిగా నివారించాలని గూగుల్ సూచించింది. డిసెంబరు 15 నుంచి ఈ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అపాయింట్మెంట్లు భారీగా జాప్యం అవుతున్నాయని గూగుల్ నిపుణులు పేర్కొన్నారు.
అదే విధంగా ఎఫ్, జే, ఎం వంటి విద్య, పరిశోధన వీసాలపైనా ఈ వెట్టింగ్ ప్రభావం పడే అవకాశం ఉందని గూగుల్ అంచనా వేసింది. వీసా ప్రక్రియలో అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, విదేశీ ఉద్యోగులు అమెరికా లోపలే ఉండటం మంచిదని సంస్థ సలహా ఇచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!