

విడుదలకు ఒక్కరోజు ముందు ది కేరళ స్టోరీ 2 చిత్రానికి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. సినిమా ప్రచార చిత్రాల్లో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిత్రాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సినిమా విడుదలపై స్టే విధించింది.
2023లో వివాదాల మధ్య విడుదలైన ది కేరళ స్టోరీకి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో, విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమ పేరుతో మోసపోయిన యువతుల జీవితాల్లో చోటుచేసుకునే సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 27న విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, హైకోర్టు ఉత్తర్వులతో విడుదల ప్రస్తుతం వాయిదా పడింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!