

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల పై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు ప్రారంభించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో జరిగిన ఈ తనిఖీల్లో పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫిల్ గ్రూప్‌లకు చెందిన యజమానుల ఇళ్లలో ఐటీ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్ చైన్ల ప్రధాన కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.
రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ నివాసాల్లో ఆరు ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తున్నాయి. రికార్డుల్లో చూపిన ఆదాయం, వాస్తవ ఆదాయం మధ్య పెద్ద వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం. హవాలా లావాదేవీలు, నకిలీ ట్రాన్సాక్షన్లు, బినామీ ఆస్తుల పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్కర్ల ఇళ్లలో, వర్కర్లకు ఇచ్చిన వసతి గృహాలలో కూడా సోదాలు సాగుతున్నాయి. వారి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను ఐటీ విభాగానికి చెందిన సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీలక అకౌంటెంట్ మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. సోదాల సమయంలో అధికారులు హార్డ్‌డిస్కులు, అకౌంటింగ్ పుస్తకాలు, పలు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదే సమయంలో షేక్‌పేట్ ప్రాంతంలోని మేహిఫిల్ రెస్టారెంట్ ప్రాంగణంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు బృందాలు కలిసి ఆదాయం, వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపుల రికార్డులను పరిశీలిస్తున్నాయి. హైదరాబాద్‌లో మేహిఫిల్ నిర్వహిస్తున్న 15 హోటల్స్ మీద కూడా ఐటీ శాఖ దృష్టి సారించింది. వాస్తవ వ్యాపారం, రికార్డుల్లో చూపించబడిన ఆదాయానికి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తం మీద 600 మందికి పైగా ఐటీ అధికారులు 30 బృందాలుగా ఏర్పడి నగరంలో విస్తృత సోదాలు కొనసాగిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!