

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ధృవీకరించారు. న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా ఇజ్రాయెల్‌లో ఉన్న దాదాపు 40 వేల మంది భారతీయులపై ప్రభావం పడనుంది. వ్యక్తిగత, ఉద్యోగ కారణాలతో అక్కడ నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఇజ్రాయెల్‌ను విడిచి స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విమాన సేవల రద్దు వారికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సంస్థలు మాత్రమే కఠిన నియంత్రణల మధ్య విమానాలను నడుపుతున్నాయి. గత జనవరి నెలలో ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించింది. ఇందుకు అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని వినియోగించింది. అయితే, ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఈ రూట్లోని సేవలు పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో శనివారం ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జేపీ సింగ్ మరియు ఎంబసీ సిబ్బంది అక్కడ ఉన్న భారతీయులతో వర్చువల్ సమావేశం నిర్వహించి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!