
అమరావతి రాష్ట్రంలో నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వేసవి ప్రారంభానికి ముందు భూగర్భజలాలు 6 మీటర్ల లోతులో, వర్షాకాలం ముగిసే సమయానికి 3 మీటర్ల లోతులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సాగునీటి సంఘాలు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో జల సంరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నీటి సంరక్షణ మరియు జలవనరుల పరిరక్షణను ప్రధాన అజెండాగా తీసుకుని 100 రోజుల కార్యాచరణను ప్రకటించారు. సాగునీటి సంఘాలు కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రంలోని 60 వేల మంది సభ్యులకు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. నీటి భద్రతను ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు నాలుగు దశల కార్యాచరణను ప్రకటించారు. ఈ రోజు నుంచి 15 వరకు పనుల గుర్తింపు, ఈ నెల 16 నుంచి 20 వరకు పరిపాలనా అనుమతులు, ఈ నెల 21 నుంచి జూలై 9 వరకు పనుల అమలు, జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనుల నివేదిక సమర్పణ జరగాలని సూచించారు. నీటి పొదుపును ప్రధానంగా తీసుకుని ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి చుక్క నీటిని సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగాలని తెలిపారు. వివిధ శాఖలు, సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల సమన్వయంతో అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ విధానపరమైన అంశాలను పర్యవేక్షిస్తుందని, జిల్లా మరియు క్షేత్రస్థాయిలో కలెక్టర్, సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 5697 గ్రామాల్లో భూగర్భజలాల సమస్యను గుర్తించామని, అన్ని చెరువులను నింపి భూగర్భజల మట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడం లక్ష్యమని తెలిపారు. నీటిని నిల్వ చేయడం, పొదుపు చేయడం, మైక్రో ఇరిగేషన్ అమలు చేయడం ద్వారా ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!