

అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు అమెరికా విధించిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నౌకల రాకపోకలకు అనుకూలంగా ఆ మార్గాన్ని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ ఆందోళనల ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ 110.58 డాలర్లకు చేరగా, ఇది క్రితం ముగింపుతో పోలిస్తే 1.42 శాతం పెరుగుదల నమోదు చేసింది. అదే విధంగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ 111.90 డాలర్లకు ఎగబాకింది. అయితే మార్కెట్లో స్థిరత్వం కోసం ఒపెక్ ప్లస్ దేశాలు మే నెలలో చమురు ఉత్పత్తిని పెంచుతామని నిర్ణయించాయి.
ఈ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపించింది. ఈ రోజు దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోయి 72,953 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 22,624 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, హిందాల్కో, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉండగా, రిలయన్స్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఒకవైపు ట్రంప్ ప్రకటనలు, మరోవైపు ఒపెక్ ప్లస్ దేశాల నిర్ణయాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక రూపాయి కొంత బలపడింది; డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.85గా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!