

తిరుమలలో భక్తులను మాటలతో మభ్యపెట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను తిరుమల టూటౌన్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్ రమేష్, హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్ కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 28 న కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను పీఏసీ-5 వద్ద, అలాగే ఈ నెల 29 న తెలంగాణకు చెందిన మరో భక్తుడిని కల్యాణకట్ట షెడ్ల పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసుకుని నమ్మకం సంపాదించారు. అనంతరం మాయమాటలతో వారి లగేజీ బ్యాగులను స్వాధీనం చేసుకుని, అందులోని నగదు మరియు విలువైన వస్తువులను చోరీ చేశారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, రాంభగీచా కార్ పార్కింగ్ వద్ద నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌తో పాటు రూ.45,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!