

రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఫస్టియర్‌లో 4,89,126 మంది, సెకండియర్‌లో 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 9,97,075 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు కూడా అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించేందుకు 14416, 80693 91416 హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. అవసరమైతే ఈ నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని సూచించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు. మౌలిక వసతుల మెరుగుదలకు ఒక్కో విద్యాసంస్థకు సుమారు రూ.50 కోట్లు కేటాయించే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గురుకులాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు అందించడమే లక్ష్యంగా పరిపాలనాపరమైన మార్పులు చేపడుతున్నట్లు చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!