

మాధాపూర్ గుట్టల్లో ఉన్న దుర్గం చెరువులో మురుగు నీరు నేరుగా కలుస్తుండటం, గుర్రపు డెక్క విస్తరించడం వల్ల దుర్గంధం వ్యాపిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలకు దిగింది. మీడియా కథనాలు, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం దుర్గం చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులో సగం వరకు గుర్రపు డెక్క వ్యాప్తి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎస్టీపీలున్నప్పటికీ వరద కాలువ ద్వారా మురుగు నీరు చెరువులోకి చేరడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చెరువు సంరక్షణ బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్‌స్పేస్, ఎస్టీపీల నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యకు కారణమని హైడ్రా కమిషనర్ తెలిపారు. మురుగు నీరు పూర్తిగా ఎస్టీపీలకు మళ్లేలా చర్యలు తీసుకోవాలని, శుద్ధి చేసిన నీటి నమూనాలను పీసీబీకి పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమావేశమై, మురుగు నీరు చెరువులోకి చేరకుండా పైపులైన్ డైవర్షన్ పనులు తక్షణమే చేపట్టాలని సూచించారు. అలాగే, ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి కలవకుండా కాలువ తవ్వే పనులు చేపట్టాలని రహేజా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!