

అమెరికా కాంగ్రెస్‌లో H-1B వీసా ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని సూచించే కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన ద్వారా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లో మార్పులు చేసి, H-1B వీసా పథకాన్ని పూర్తిగా తొలగించాలని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉండదు.
ప్రస్తుతం H-1B వీసాల పై అధికంగా ఆధారపడుతున్న భారతీయ ఐటీ నిపుణుల పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ భవిష్యత్తు పై అనిశ్చితి నెలకొనే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ బిల్లును ప్రస్తుతం హౌస్ జ్యూడిషియరీ కమిటీ, ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ, వేస్ అండ్ మీన్స్ కమిటీలకు పంపించారు. అయితే ఇప్పటివరకు ఈ బిల్లు పై ఎలాంటి హియరింగ్స్ గానీ, ఓటింగ్ తేదీలు గానీ ఖరారు కాలేదు.
అయితే న్యాయ, ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా విస్తృతమైన మార్పు కావడంతో చట్టంగా మారే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలు, వ్యాపార సంఘాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇదే సమయంలో, 2025 లో సెనేటర్లు చక్ గ్రాస్లీ మరియు డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన H-1B, L-1 వీసా రిఫార్మ్ బిల్లు మాత్రం వీసాలను పూర్తిగా రద్దు చేయకుండా, దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం వంటి సంస్కరణల పై దృష్టి సారించింది.
మొత్తంగా చూస్తే, తాజా ప్రతిపాదన రాజకీయ చర్చలకు దారి తీసినా, తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!