

అమెరికాలో శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు మరింత కఠినంగా మారుతోంది. గతంలో అమెరికన్ పౌరుడిని లేదా పౌరురాలిని వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సులభమైన మార్గంగా భావించేవారు. అయితే ప్రస్తుత డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఈ విధానంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు.
ఇక పై కేవలం చట్టబద్ధమైన పెళ్లి పత్రాలు ఉండటం సరిపోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే చిరునామాలో కలిసి నివసిస్తున్నారనే ఆధారాలు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. వేర్వేరు ఇళ్లలో ఉంటే ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని USCIS స్పష్టంగా చెబుతోంది.
ఈ మార్పుల పై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ స్పందిస్తూ, కేవలం పెళ్లి బంధం ఉంటే గ్రీన్ కార్డ్ రాదు. నిజంగా కలిసి జీవిస్తున్న దంపతులకే అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో దంపతులు వేర్వేరు చోట్ల ఉంటే, అధికారులు ఆ సంబంధాన్ని అనుమానాస్పదంగా పరిశీలించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ కార్డ్ కలిగిన వ్యక్తుల పాత్ర ఉండటంతో ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. గతంలో ‘ఆందోళనకర దేశాలు’గా గుర్తించిన 19 దేశాలకు చెందిన శాశ్వత నివాసితుల గ్రీన్ కార్డ్‌లను సమగ్రంగా పునఃసమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు. అదేవిధంగా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఇచ్చే పని అనుమతి కాలాన్ని 18 నెలలకు పరిమితం చేశారు.
ఇదే క్రమంలో ఏటా వేల మందికి అవకాశం ఇచ్చే ‘డైవర్సిటీ వీసా లాటరీ’ పథకాన్ని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దంపతులు ఒకే ఇంట్లో నివసిస్తున్నారా? వారి మధ్య ఉన్న బంధం నిజమైనదేనా? అనే అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఇంటికి వచ్చి మరీ విచారణ చేసే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే విడిగా నివసిస్తున్న దంపతులు గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!