

గత 20 రోజులుగా తీవ్రంగా వేధిస్తున్న ఎండల నుంచి తెలంగాణ ప్రజలకు ఊరట లభించనుంది. వేసవి ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వచ్చే నెల 1 నుంచి ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి.
హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉండగా, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40-42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. వచ్చే నెల 5 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గి హైదరాబాద్‌లో 35-36 డిగ్రీలు, ఉత్తర, తూర్పు జిల్లాల్లో 38-39 డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5న కేరళలోకి ప్రవేశించి, 10 నుంచి 12 మధ్య తెలంగాణలోకి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!