

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి, వాటిని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 40 నుంచి 50 మహిళా సంఘాలకు ఈ బస్సులు అందజేయనున్నట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం ద్వారా అదనపు ఆదాయం కల్పించడంలో విజయవంతమయ్యామని, అదే నమూనాను నగరంలో కూడా అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నగరంలో మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మహానగర పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మెతె శ్రీలతారెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం 72,942 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, వాటిని లక్షకు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 22 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!