

రాజధాని ప్రాంతంలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఉపయోగించి కొత్త ఐటీ సంస్థలు, క్లస్టర్లు ఏర్పాటుచేయాలని టీజీఐఐసీ చర్యలు ప్రారంభించింది. ఇటీవల గచ్చిబౌలి సమీపంలో టీజీఐఐసీకి చెందిన భూములను వేలం వేయగా ఒక్క ఎకరం ధర రూ.170 కోట్లకు పైగా చేరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీ కారిడార్ పరిధిని మరింత విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వ భూముల పై అక్రమ ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ పరిసర గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో సుమారు 60 శాతం నిజాం కాలంలో దానంగా ఇచ్చినవని అధికారులు చెబుతున్నారు. వారసులు లేకపోవడం, రెవెన్యూ రికార్డులు సక్రమంగా నమోదు కావడంతో వాటిలో ఎక్కువభాగం ప్రభుత్వానికి చెందాయి. అయితే కొన్ని వ్యక్తులు నిజాం వారసుల నుంచి దానం పొందామని, జీపీఏ ఇచ్చారని చెబుతూ నకిలీ పత్రాలు తయారుచేసి కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు గుర్తించారు.
శేరిలింగంపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూముల పై వివాదాలు కొనసాగుతున్నాయి. గండిపేట మండలంలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులు తమకే హక్కులున్నాయని వాదిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు డిజిటల్ సర్వేలు ప్రారంభించారు. ఆధునిక పరికరాల సహాయంతో భూములు ఎంతవరకు ఆక్రమించబడ్డాయో గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!