

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, వాటిని ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఇటీవల సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన రైళ్లు ఉదయం 4.30 గంటల నుంచి 7 గంటల మధ్య సికింద్రాబాద్, నాంపల్లి వంటి రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి, దిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు వందేభారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉదయం 5 నుంచి 6.20 గంటల మధ్య బయల్దేరుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో మెట్రో సేవలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ సమస్యపై గతంలోనే హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కు (హెచ్‌ఎంఆర్‌ఎల్) లేఖ రాశామని, అయితే సాంకేతిక కారణాలు, నిర్వహణ సమస్యల కారణంగా సమయాలను మార్చలేమని సమాధానం వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నాగోలు, మియాపూర్, ఎల్‌బీనగర్ స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లకు తొలి మెట్రో రైలు చేరే సమయానికి 6.20 నుంచి 6.30 గంటలవుతోందని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!