

గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో గోదావరి పుష్కరాల నిర్వహణపై తొలిసారి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఈ సూచనలు చేశారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇంకా 18 నెలల సమయమే ఉండటంతో పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నందున మౌలిక వసతులు, భద్రత, సేవలు సమర్థవంతంగా కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మొత్తం 373 ఘాట్ల అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. రాజమహేంద్రవరంలో మోడల్ ఘాట్ ఏర్పాటు చేసి, అదే నమూనాలో మిగతా ఘాట్లు నిర్మించాలని సూచించారు. ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, టెంట్ సిటీలు, హోం స్టేలు, బలమైన భద్రతా చర్యలు, రహదారులు, రైలు, విమాన సేవల విస్తరణపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని, పర్యాటక ప్రోత్సాహం మరియు ప్రజా భాగస్వామ్యంతో గోదావరి పుష్కరాలను చారిత్రాత్మక విజయంగా నిలపాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!