

దేశవ్యాప్తంగా ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థల పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలు చేపట్టింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఉన్న వింజో మరియు గేమ్స్క్రాఫ్ట్ కార్యాలయాలు, అలాగే ప్రమోటర్ల నివాసాల పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో మొత్తం రూ.523 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లను ఈడీ స్తంభింపజేసింది.
‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్–2025’ ప్రకారం దేశంలో రియల్ మనీ గేమ్స్ నిషేధితమైన నేపథ్యంలో కూడా, ఈ రెండు సంస్థలు ప్లేయర్ల డబ్బును తిరిగి చెల్లించకుండా తమ వద్దే ఉంచుకున్నాయని ఈడీ ఆరోపించింది.
వింజో ప్లాట్‌ఫాంలో యూజర్లు నిజమైన వ్యక్తులతో కాకుండా అల్గారిథమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌తో గేమ్ ఆడుతున్నారనే విషయాన్ని దాచిపెట్టారని, ఈ చర్యలు నేరపూరితమైనవని అధికారులు పేర్కొన్నారు. బ్రెజిల్, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో కూడా రియల్ మనీ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వింజో వద్ద ఇంకా రూ.43 కోట్ల మేర గేమర్ల డబ్బు నిల్వగా ఉండటాన్ని, రూ.505 కోట్ల అక్రమ డిపాజిట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో, ‘పాకెట్52.కామ్’ పేరుతో గేమింగ్ సేవలు అందించిన గేమ్స్క్రాఫ్ట్ సంస్థ కూడా రూ.30 కోట్లకుపైగా కస్టమర్ల డబ్బును తమ వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. ఈ సంస్థకు చెందిన రూ.18.57 కోట్లను స్తంభింపజేశారు.
వింజో యూజర్లు తమ వాలెట్లోని డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అడ్డుకోవడం లేదా పరిమితం చేయడం ద్వారా, అల్గారిథమ్‌ల సహాయంతో కస్టమర్ల డబ్బును కొల్లగొట్టినట్లు కూడా ఈడీ తెలిపింది. విదేశీ పెట్టుబడుల పేరిట నిధులను అమెరికా, సింగపూర్‌లకు తరలించినట్లు గుర్తించారు. అమెరికాలోని బ్యాంకులో 55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.490 కోట్లు) ఉంచినట్లు ఆరోపించారు.
ఈ పరిణామంపై వింజో స్పందించింది. దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నామని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!