

ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ పై అధికారులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అంచనాల ప్రకారం సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనుండటంతో పాటు, ఇప్పటికే ఉన్న ఖాళీలు కూడా కలవడంతో నియామకాలు అవసరమయ్యాయి.
ఈ విద్యా సంవత్సరంలో జీవో 117 ను రద్దు చేసి, ప్రభుత్వం తొమ్మిది కొత్త విధానాలను అమలు చేసింది. ఈ మార్పుల్లో భాగంగా 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించే విధానాన్ని అమలు చేశారు. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేపట్టారు.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత, పాఠశాల విద్యాశాఖ చేసిన అంచనాల ప్రకారం 1,146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరమని గుర్తించారు. ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయడానికి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఇప్పుడు ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలను కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 2,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, తుది లెక్కల్లో ఆ సంఖ్య 2,500 వరకు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో మొత్తం 2,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!