

దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఆదివారం ఉదయం నగరమంతటా దట్టమైన పొగమంచు అలుముకోవడంతో దృశ్యమానత పూర్తిగా తగ్గిపోయింది. ముందున్నవి కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరిందని అధికారులు వెల్లడించారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా శనివారం నుంచే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం, సఫ్దర్‌గంజ్, పాలమ్ ప్రాంతాల్లో దృశ్యమానత 100 మీటర్లకు దిగువకు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు విమాన సంస్థలు విమానాలను వాయిదా వేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 35 శాతం విమానాలు ఆలస్యమయ్యాయి. అయితే ఉదయం 8 గంటల తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు బరేలీ,లక్నో, కుషీనగర్, అమృత్సర్, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ వంటి ఉత్తర భారత ప్రాంతాల్లోనూ తీవ్ర పొగమంచు ప్రభావం కనిపించిందని ఐఎమ్‌డీ పేర్కొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!