

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో సంచలనం రేపిన అత్యాచారం మరియు హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం వెలువడిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గత ఏడాది మార్చి నెలలో తుంగభద్ర ఎడమ కాలువ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ, అమెరికాకు చెందిన డేనియల్ (23), మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పంకజ్ (43), ఒడిశాకు చెందిన డిబాస్ (42) ఆనెగుందిలోని ఒక హోంస్టేలో బస చేశారు.
ఆ రాత్రి హోంస్టే నిర్వాహకురాలితో కలిసి వారు సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ ఆలయం వద్ద సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకుని డబ్బు కోరారు. డబ్బు ఇవ్వకపోవడంతో వారు ఇద్దరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు.
ఈ పరిస్థితిని గమనించిన డేనియల్, పంకజ్, డిబాస్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో ఆగ్రహించిన నిందితులు ముగ్గురు పురుషులను తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు. అనంతరం అక్కడున్న ఇద్దరు మహిళల పై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాలువలో పడిన డేనియల్, పంకజ్ ఈదుకుంటూ బయటపడ్డారు. అయితే డిబాస్ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఘటన అనంతరం పోలీసులు మల్లేశ్ అలియాస్ హండిమళ్ల, సాయి, శరణప్పలను అరెస్టు చేశారు. విచారణ అనంతరం కొప్పళ సెషన్స్ కోర్టు ఈ కేసులో ముగ్గురినీ దోషులుగా తేల్చి మరణదండన విధించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!