

ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) డిపాజిట్ల పై 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వరుసగా మూడో ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగడం గమనార్హం. 2022-23 లో వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, తదుపరి ఏడాది అది 8.25 శాతానికి పెరిగింది. అప్పటి నుంచి అదే రేటు కొనసాగుతోంది. సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్లాల్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతున్నామని కార్మిక శాఖ వెల్లడించింది. గుర్తింపు పొందిన పీఎఫ్ ట్రస్టులకు ఆదాయపు పన్ను శాఖ తదితర విభాగాల వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఒకేసారి అమలు చేసే ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా ఆరు నెలలలో కేసులు, ఇతర సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా, పీఎఫ్ మినహాయింపులకు సంబంధించిన సరళతర ప్రామాణిక విధివిధానాలను కూడా ఆమోదించారు. ఖాతాలో రూ.1000 కంటే తక్కువ నిల్వ ఉన్నట్లయితే, ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇచ్చారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!